టీం ఇండియా క్రికెట్ దిగ్గజం,మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ నేతృత్వంలో భారత్ తొలిసారి 1983లో ప్రపంచకప్ అందుకుంది. అనంతరం 28ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రస్తుత టీం ఇండియా సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్‌ధోనీ నాయకత్వంలోని టీమిండియా సాంతగడ్డపై ప్రపంచకప్ గెలిచింది. దేశంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయిలోని వాంఖడే మైదానంలో శ్రీలంకపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మైదానంలో భారత ఆటగాళ్ల సంబరాలకు అవధుల్లేవు. భారమైన కళ్లతో ఒకరికొకరు హత్తుకున్నారు. సిక్స్‌తో భారత్‌కు విజయాన్ని అందించిన ధోనీ మాత్రం ఈ మ్యాచ్ అనంతరం ఏడ్చేశాడంట.
ఈ విషయం ప్రముఖ ప్రాతికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ రచించిన ‘డెమోక్రసీ-ఎలెవన్’ ద్వారా బయటికి వచ్చింది.ఫైనల్‌లో 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. సెహ్వాగ్ డకౌట్ అవ్వగా సచిన్ 18 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గంభీర్-విరాట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేయత్నాన్ని తమ భుజాన వేసుకున్నారు. కోహ్లీ ఔటవ్వడంతో మైదానంలోకి వచ్చిన ధోనీ-గంభీర్‌తో కలిసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49వ ఓవర్లో రెండో బంతిని సిక్స్‌గా మలిచి భారత్‌కు మరుపురాని విజయాన్ని అందించాడు.
దీంతో ఒక్కసారిగా భారత ఆటగాళ్ల పరుగెత్తుకుంటూ మైదానంలోకి దూసుకొచ్చారు. బరువెక్కిన కళ్లతో ఒకరినొకరు హత్తుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సన్నివేశాలన్ని మనం చూశాం. కానీ, కెమెరా కంటికి చిక్కని ఓ సన్నివేశం గురించి ధోనీ తెలిపాడు. ‘ఔను, నేను ఏడ్చాను. కాకపోతే అది కెమెరాలకు చిక్కలేదు అంతే. దేశానికి ఇంత గొప్ప విజయం అందించిన తర్వాత ఎవరైనా భావోద్వేగానికి గురవ్వడం సహజమే. నేను కూడా అంతే. హర్భజన్ వచ్చి నన్ను హత్తుకున్నప్పుడు నేను నా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయా. ఏడిచాను. తలదించుకోవడంతో అది కెమెరాకు చిక్కలేదు’ అని ధోనీ వివరించాడు.