ప్రస్తుత సమాజంలో కాసులకు కక్కుర్తి పడి కాన్పులు చెయ్యంకుండా….కోసెస్తున్నారు. వైద్యాన్ని దందాగా మార్చిసిన రోజులు. పురుడుకొస్తే ప్రాణాలు తీస్తున్నారు. అయ్యా కాపాడండయ్యా అంటే… రూపాయి ఇస్తేనే వైద్యం అంటున్నారు. శవానికి వైద్యం చేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి కాలంలో కూడా… రూపాయి ఆశించకుండా.. మావనసేవే మాధవసేవగా భావించి అసలైన వైద్యనారాయణుడిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అది ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కూర్మనూరు పంచాయతీలోని అత్యంత మారుమూల గ్రామమైన సారిగెట్ట. ఈ గ్రామానికి రావాలంటే మూడు చోట్ల నదిని దాటాలి. కనీసం సమాచార వ్యవస్థ కూడా లేదు. ఇలాంటి గ్రామానికి చెందిన సువర్ణకు బుధవారం పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని పప్పులూరు వైద్యాధికారి ఓంకార్ హోత్తాకు ఓ వ్యక్తి తెలిపాడు. వెంటనే అక్కడి నుంచి బయలు దేరాడు. స్థానిక జర్నలిస్ట్ సాయంతో కలిసి మోటారు సైకిల్‌పై అతికష్టం మీద సరిగెట్ట గ్రామానికి వెళ్లారు. సువర్ణకు పురుడు పోశారు. అయితే తల్లీబిడ్డల ఆరోగ్యం బాగాలేకపోవడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించాలని వైద్యుడు సూచించారు. తరలించేందుకు వాహన సదుపాయం లేకపోవడంతో చలించిన వైద్యుడు ఓంకార్ తల్లీ బిడ్డలను మంచంపై ఉంచి డోలీ కట్టి సుమారు 10 కి.మీ. దూరం నడిచారు ఓంకార్. బంధువులు కూడా కాలినడకన మోసుకుంటూ పప్పులూరు ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం స్థానిక పేపర్లలో రావడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓంకార్ కు నెటిజన్లు సలాం చేస్తున్నారు.
