ఒకే తల్లి పేగు తెంచుకొని పుట్టిన సోదరులు ఆత్మీయంగా మసలుకుంటూ.. పరస్పరం అండగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కష్టాలొస్తే ఉమ్మడిగా ఎదుర్కొంటుంటారు. ఇదంతా తల్లి గర్భం నుంచి బయటకొచ్చాకే జరుగుతుంటుంది. మాతృ గర్భంలో ఉండగానే ఆ శిశువులు చూపిన సోదర ప్రేమ.. వారి ప్రాణాలను రక్షించింది. వారి ఆత్మీయ కౌగిలి బంధమే.. వారికి సంజీవని అయ్యింది. బ్రిటన్‌లో నర్సుగా పనిచేస్తున్న వికీ ప్లోరైట్(30) రెండోసారి గర్భందాల్చింది. 10వారాల గర్భిణిగా ఉన్నప్పుడు సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లింది. స్కానింగ్ చేయించుకుంది. అంతా సవ్యంగానే ఉంటుందన్నకున్న ఆమె అంచనాలను తలకిందులు చేస్తూ.. సోనోగ్రాఫర్ ఆందోళనకర విషయాన్ని బయటపెట్టాడు. ఆమె గర్భంలో కవలలు ఉన్నారని, వారు పరస్పరం చాలా దగ్గరగా ఉన్నారని చెప్పాడు. వెంటనే అంతర్గత స్కాన్ నిర్వహించారు. అదృష్టవశాత్తు వారు అవిభక్త కవలలు కాదని తేలింది.
ఒకే తిత్తి..
వైద్యులు పరిశీలించి.. ఆ చిన్నారులకు ఒకే ఉమ్మనీరు తిత్తి ఉందని పేర్కొన్నారు. నిజానికి చెరొక తిత్తి ఉండాలి. ఇది చాలా అరుదైన సమస్య. ప్రతి 60వేల కవలల్లో ఒకరికి మాత్రమే ఇది తలెత్తుతుంది. వికీ గర్భంలోని శిశువులకు వేరువేరు బొడ్డుతాళ్లు ఉన్నాయి. వీరికి ఉమ్మనీరు తిత్తు ఒక్కటే ఉండటం వల్ల ఆ బొడ్డు తాళ్లు చిక్కుబడిపోయి.. ఇద్దరికీ ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని వికీకి వైద్యులు చెప్పారు. దీనివల్ల వారు మరణించే ప్రమాదం 50% మేర ఉందన్నారు. దీంతో వికీ హతాశురాలైంది. అయితే రెండు వారాల తర్వాత నిర్వహించిన స్కాన్‌లో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. గర్భస్థ శిశువులిద్దరూ ప్రాణాలు రక్షించుకునేలా పరస్పరం హత్తుకున్నారని, ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారని తేలింది. నిశ్చలంగా ఉంటూ.. బొడ్డు తాళ్లు చిక్కుబడిపోయే ప్రమాదాన్ని తప్పించుకున్నారని వెల్లడైంది. మరోవారం తర్వాత నిర్వహించిన మరో స్కాన్‌లో.. ఒక చిన్నారి బొడ్డుతాడు మరో చిన్నారిని గట్టిగా చుట్టేసినట్లు వెలుగు చూసింది. దీంతో ఆ శిశువులు మరింత దగ్గరకావడంతోపాటు మరింత నిశ్చలంగా ఉన్నారు. దీనివల్ల బొడ్డుతాళ్లలో పెద్ద చిక్కుముడి పడే ప్రమాదం చాలా వరకూ తగ్గిపోయింది. ఇలా ఒకటి రెండు వారాలకోసారి వైద్యులు వికీని పరీక్షిస్తూ.. తాజా స్థితిని ఎప్పటికప్పుడు విశ్లేషించారు. ఎట్టకేలకు 32 వారాల గర్భం పూర్తయ్యాక గుల్‌ఫోర్డ్‌లోని రాయల్ సర్రే ఆసుపత్రిలో ఆమెకు శస్త్రచికిత్స చేసి కవలలను బయటకు తీశారు. వారిద్దరూ మగ పిల్లలు. వారికి రూబెన్, థియో అని పేరు పెట్టారు. గర్భంలో పరిమిత చోటు మాత్రమే ఉండటంతో థియో పెద్దగా ఎదగలేదు. ఇప్పుడు ఆ చిన్నారులకు 22 నెలలు వచ్చాయి. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.
Tags britan doctors love twines