వచ్చే ఏడాది నిర్ణీత కాల పరిమితి ప్రకారమే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై సమీక్ష చేపట్టిన సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవగానే సర్పంచ్‌లకు పూర్తిస్థాయిలో శిక్షణను చేపట్టి విధులు, అధికారాలు, బాధ్యతలు, నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారు. గ్రామస్తుల్లో శ్రమదానం ద్వారా పనులు చేసుకునే ధోరణిని అలవాటు చేయాలని సీఎం చెప్పారు. గ్రామ పంచాయతీకి విధులు, బాధ్యతలతో పాటు నిధులు సమకూర్చి ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా పనిచేసేలా చూడాలన్నారు. ఇన్ని విధాల సహకారం అందించినా విధుల నిర్వహణలో వైఫల్యం చెందితే క్రమశిక్షణ చర్యలు తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండాలని పేర్కొన్నారు. వీటన్నింటికీ అవకాశం కల్పించే విధంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం తయారు కావాలని సీఎం తెలిపారు. ఎవరి గ్రామ అభివృద్ధి ప్రణాళికను వారే తయారు చేసుకునే విధంగా తర్ఫీదునివ్వాలన్నారు. ఆ గ్రామానికికున్న ప్రస్తుత, భవిష్యత్ అవసరాలేంటని బేరీజు వేసుకుని అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. దానికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలన్నారు. సర్పంచ్‌లు మంచిపనులు చేసే అవకాశం కల్పించేలా ప్రభుత్వ విధానం ఉండాలి. ఎవరో ఏదో అంటారని కాకుండా, ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణతో ప్రజలతో అనుసంధానమై పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు.
