కోచింగ్ క్లాస్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న 19ఏళ్ల యువతిపై నలుగురు మృగాళ్లు పైశాచికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి బాధిత యువతి పోలీసుల దగ్గరకు వెళితే వాళ్లు పట్టించుకోకపోగా.. ఆమె చెబుతున్నది ఏదో సినిమా కథలా ఉందని అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
19ఏళ్ల యువతి సివిల్స్ కోచింగ్ క్లాస్ ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేందుకు భోపాల్‌లోని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌కు వెళ్తొంది. గమనించిన గోలు, అమర్ అనే యువకులు ఆమెను అడ్డగించి దాడి చేసి రైల్వేస్టేషన్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. వాళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు దాదాపు మూడు గంటల పాటు ఆమెపై పైశాచికంగా సామూహిక అత్యాచారనికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాధిత యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేకప్ వేసుకొని అత్యాచారం జరిగిందని చెప్పి నాటకమాడుతున్నట్లు ఒక పోలీస్ హేళనగా మాట్లాడారని బాధితురాలు తెలిపారు. బాధిత యువతి తల్లిదండ్రులు కూడా భద్రతా రంగంలోనే పనిచేస్తున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం తిరిగి వస్తుండగా.. ఘటన జరిగిన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో గోలు, అమర్‌ను యువతి గుర్తించింది. వెంటనే ఆమె కుటుంబసభ్యులు వారి వెంట పడి ఎట్టకేలకు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ కేసు విచారణ చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధిత యువతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
