తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నకిలీ విత్తనాల విక్రయంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిని రాష్ట్రం నుంచి పూర్తిగా ఏరేస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 50 టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఏరివేసే పనిలో నిమగ్నమయ్యాయని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మిన ఇద్దరిపై పీడీయాక్ట్ కేసు నమోదు చేశామన్నారు.