పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఇప్పటికీ కొంతమంది ఆ పసిప్రాణాలను కడుపులోనే చిదిమేస్తున్నారు. ఇటువంటి వాటిని నియంత్రించేందుకు కేరళలోని ఓ కౌన్సిలర్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆడపిల్ల పుడితే.. బహుమతిగా బంగారు నాణేన్ని ఇస్తున్నారు.
కేరళలోని మలప్పురం జిల్లా కొట్టాక్కళ్ మున్సిపాలిటీలో మహిళలు ఆడపిల్లలకు జన్మనిస్తే.. వారికి బంగారు నాణేన్ని బహుమతిగా ఇస్తున్నారు అక్కడి మున్సిపల్ కౌన్సిల్ అబ్దుల్ రహీమ్. బాలికల నిష్పత్తిని కాపాడేందుకు ఈ వినూత్నమైన ఆలోచన చేశారు. రెండేళ్లుగా ఆయన వార్డులో ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు ఒక గ్రాము విలువ చేసే బంగారు నాణేన్ని బహుకరిస్తున్నారు. ఆయన చేస్తున్న పనిని ఎంతో మంది ప్రశంసిస్తున్నారు.
‘చాలా మంది పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లలు లేకుండా ఒక్కసారి ప్రపంచాన్ని వూహించుకోండి? ఎలా ఉంటుంది. అన్ని మత గ్రంథాల్లో ఆడపిల్లకు ప్రథమ స్థానం ఉంటుంది. కానీ, నిజ జీవితంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మార్పు రావాలి. అందుకే ఇలా రెండేళ్లుగా ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లికి బంగారు నాణెం ఇస్తున్నా. ఇక మీదట దాన్ని రెట్టింపు చేయాలని అనుకుంటున్నా’ అని రహీమ్ చెప్పుకొచ్చారు. ఆయన చేస్తున్న సేవను చూసిన కొందరు బంగారువర్తకులు తాము కూడా సహాయం చేస్తామని ముందుకు వచ్చినా రహీమ్ అందుకు నిరాకరించారు. ‘ఇది పబ్లిసిటీ కోసం చేయడం లేదు.. నా జీతంలోనే వీటిని నేను కొనగలను’ అని సంతోషంగా చెప్తున్నారు రహీమ్. ఇప్పటి వరకు 16 మంది తల్లులకు బంగారు నాణేలను అందించారు
