వచ్చే బడ్జెట్లో నేరుగా గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు నిధులు అందించనున్నట్లు వెల్లడించారు. నూతన పంచాయితీ రాజ్ చట్టం రూపకల్పనపై పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నిపుణులతో సీఎం కేసీఆర్ నేడు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుతో తెలంగాణలో గ్రామ పంచాయతీల సంఖ్య 12-13 వేలు దాటుతుందన్నారు. ఈ గ్రామ పంచాయతీలు కేవలం నామమాత్రంగా ఉండడానికి వీలు లేదన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు విధులు, బాధ్యతలు లేకుండా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అవన్నీ ప్రజలకు నూటికి నూరు శాతం చేరాలంటే స్థానిక సంస్థలు బాగా పనిచేయాలన్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామ పంచాయతీ చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరుతాయన్నారు. విధులు, బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంటే గ్రామ పంచాయతీలు ఏ పనీ చేయలేవన్నారు. వాటికి కావాల్సిన నిధులు కూడా అందించాలన్నారు. కేంద్ర నిధులు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద లభ్యమయ్యే నిధులు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు, నరేగా ద్వారా సమకూరే డబ్బులు అన్నీ జమచేసి గ్రామ పంచాయతీకి అప్పగించాలని సీఎం కేసీఆర్ అన్నారు.
