పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పురందేశ్వరి లేఖ రాశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ 14% తక్కువ కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకుందని… అంత తక్కువకు ప్రాజెక్టు పూర్తిచేయడం అసంభవమని లేఖలో పేర్కొన్నారు. ఆ కంపెనీకి ఉన్న అనుభవం, సమర్ధత లోటు తెలిసి కూడా రాష్ట్రప్రభుత్వం 3సంవత్సరాల విలువైన సమయం వృధా చేసిందని విమర్శించారు.
కేంద్రం అన్ని విధాలా సహకరించి నిధులు సమకూరుస్తున్నా… రాష్ట్రం వినియోగించుకోలేకపోతుందంటూ పురందేశ్వరి ఎద్దేవా చేశారు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమయానికి దాఖలు చేయట్లేదన్న పురందేశ్వరి… 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఏపీకు జీవధారగా మారనున్న పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తిచేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. నితిన్ గడ్కరీని కోరారు. ఈ లేఖ ప్రతిని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లకు కూడా ఆమె పంపించారు. దీంతో పురంధేశ్వరి చంద్రబాబును మరోసారి ఇరకాటంలో పడేసిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.