ఫ్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ది చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. ఎలాంటి విషయం పైన అయినా ఒక అభిప్రాయం వెల్లడిస్తుంటారు. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ.. ఇలా అనేక సినిమాల్లో నటించి, ఆయా సినిమాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్, గత కొన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ మధ్య ప్రముఖ హీరోలందరూ ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తమిళనాట సూపర్ స్టార్లు రజనీకాంత్ కమల్ హాసన్ కన్నడనాట ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలుగు నాట అశేష అభిమానులను కలిగిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇప్పటికే రాజకీయ రంగంలోకి దిగిపోయారు. ఈ నేపథ్యంలో రాజకీయ రంగంలో విజయం సాధించాలంటే ఎలాంటి లక్షణాలుండాలి అన్న అంశంపై ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ రజనీ, కమల్, ఉపేంద్ర, పవన్ కల్యాణ్ పేర్లు ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్లు చేశారు.
భారత్ లాంటి దేశంలో ప్రజా నాయకుడిగా సాగాలంటే కేవలం నటులైతే సరిపోదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నవారే గొప్ప రాజకీయ నాయకులు అవుతారని ఆయన తెలిపారు. వారిపై నాకు అభిమానం తగ్గదు. అలాగని ఆ అభిమానంతో వారికి నేను ఓటు వెయ్యను.. ప్రజా సమస్యలను పరిష్కరించగలిగే దమ్ము వాళ్ళకుంది అని నిరూపించుకున్నప్పుడే వారికి ఓటు వేస్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు. సినిమాలు, నటన పరంగా రజనీకాంత్, కమలహాసన్, పవన్, ఉపేంద్ర లను తాను ఎంతో అభిమానిస్తానని.. అయితే, వారు రాజకీయ పార్టీలు పెట్టి, పోటీ చేస్తే మాత్రం వారికి ఓటు వేయబోననికుండబద్దలు కొట్టేశారు.