తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా శాసనసభ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా నిన్న బుధవారం శాసనసభలో రైతు రుణమాఫీ ,వ్యవసాయ రంగం గురించి చర్చ జరిగింది .ఈ క్రమంలో నిండు సభలో మైక్ కోసం డిమాండ్ చేసిన సీనియర్ మాజీ మంత్రి ,సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర అసహనానికి గురై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు .
నిన్న బుధవారం సభ ప్రారంభమైన తర్వాత కొద్ది సేపు విరామం కోసం స్పీకర్ మధుసూదనా చారి చైర్ ను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డికి అప్పజెప్పారు .ఆ సమయంలో సభలో వ్యవసాయం గురించి జరిగిన చర్చలో సంబంధిత మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వివరణ ఇస్తుండగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు సభనుండి వెళ్ళిపోయారు .
దీంతో వ్యవసాయం పై కాంగ్రెస్ పార్టీకి ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుంది అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు .ఈ వ్యాఖ్యలతో సీఎల్పీ నేత జానారెడ్డితో సహా ప్రతిపక్ష సభ్యులు మంత్రి పోచారం వివరణకు అడ్డుపడుతూ సభ కార్యక్రమాలను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు .ఈ క్రమంలో మైక్ ఇవ్వాలని పలుమార్లు జానారెడ్డి డిమాండ్ చేశారు .మంత్రి వివరణ పూర్తైన తర్వాత మైక్ ఇస్తాను అని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఎంతగా చెప్తున్నా వినిపించుకోని జానారెడ్డి స్పీకర్ ఎందుకు వెళ్ళిపోయారో మీరు ఎందుకు వచ్చారో ఏమి చేస్తారో తెలియదా అంటూ డిప్యూటీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది .