ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు జిల్లాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమం సక్రమంగా జరగని నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని చూస్తారంటూ ఆయా నియోజక వర్గాలకు చెందిన నేతలను గట్టిగా హెచ్చరించారు.
రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలోని తన నివాసం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం అమలవుతున్న తీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా నేతలతో చర్చించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపైనా ఇందులో ప్రధానంగా చర్చ జరిగింది.ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో సక్రమంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం అమలు కాకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.పనితీరు మెరుగుపరుచుకోకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని ఇన్‌ఛార్జులను గట్టిగా హెచ్చరించారు.
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం జరుగుతున్న తీరుపై గ్రేడింగ్ నిర్వహించానన్న చంద్రబాబు..దాదాపు 55 నుండి 65 మంది ప్రాతినిధ్యం వహిస్తున్న నియజకవర్గాలు సీ, డీ గ్రేడింగ్‌లో ఉండడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులు పనితీరు మెరుగుపరుచుకోకపోతే అక్కడ 55 నుండి 65 మంది కొత్త ముఖాలు చూస్తారని ఆయన తేల్చిచెప్పారు.