ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కంటతడి పెట్టుకున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలోని తమ స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎంపీ రామ్మోహన్నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజలతో మమేకమై అలుపెరగని నాయకుడిగా జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన తన సోదరుడి ఆశయాలు నెరవేర్చడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది తన సోదరుడు ఎర్రన్నాయుడు ఆకాంక్ష అని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికే ప్రాధాన్యతా క్రమంలో సాగునీటిని అందిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రెండేళ్లలో ఆయన కలలు పూర్తిగా నెరవేరుస్తామని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం ఎర్రనాయుడు తనయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. స్వపక్షాలకు, ప్రతిపక్షాలకు తన తండ్రి ఎర్రన్నాయుడు ఆదర్శప్రాయుడని కొనియాడారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం శత్రువులు లేని వ్యక్తిగా ఆయన కొనసాగారన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రన్నాయుడు సోదరులైన విశాఖపట్నం ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రావు, ప్రసాదరావు, తల్లి కళావతమ్మ, సతీమణి విజయలక్ష్మితో పాటు జిల్లా కలెక్టర్ ధనుంజయ్ రెడ్డి, ఎస్పీ త్రివిక్రమ్ వర్మ, జేసీ చక్రధర్‌బాబు, ఏజేసీ రజనీకాంత్‌రావు, ఇచ్ఛాపురం, పలాస, శ్రీకాకుళం, పాతపట్నం, నరసన్నపేట ఎమ్మెల్యేలు బి.అశోక్, జి.శివాజీ, లక్ష్మీదేవి, కె.వెంకటరమణ, బి.రమణమూర్తితో పాటు జడ్పీ ఛైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా తెదేపా అధ్యక్షురాలు శిరీష, ఐటీడీఏ పీ.వో శివశంకర్, తెదేపా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.