తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటు టీడీపీ పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .
అంతకుముందు రేవంత్ ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం తను టీడీపీకి ..ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి ఇటు చంద్రబాబుకు అటు తెలంగాణ శాసనసభ స్పీకర్ కు ఫ్యాక్స్ పంపినట్లు మీడియాకు తెలిపిన విషయం కూడా విదితమే .
అయితే ఈ లేఖను స్పీకర్ ఆమోదిస్తే వచ్చే ఏప్రిల్ లోపు ఉప ఎన్నికలు రావడం ఖాయమంటున్నారు .ఈ తరుణంలో ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి డీకే అరుణ స్పందించారు .బుధవారం అసెంబ్లీ వద్ద మీడియాతో ఆమె మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రాకను తానేమి వ్యతిరేకించడంలేదు అని స్పష్టం చేశారు .కోడంగల్ ఉప ఎన్నిక వస్తుందని అనుకోవడంలేదు .ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో కూడా ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది అని ఆమె అన్నారు .