తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరం లో త్వరలో మెట్రో రైల్ కూత పెట్టనుంది. ప్రధాని మోడీ చేతులమీదుగా మెట్రో రైల్‌ను ప్రారంభించాలని భావించిన సీఎం కేసీఆర్.. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగనున్న అంతర్జాతీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా రానున్న ప్రధాని మోడీ.. 28న మెట్రోరైలును ప్రారంభించనున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు, సిబ్బంది స్టేషన్ల సుందరీకరణ పనుల్లో నిమగ్నమయ్యారు.
పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి పర్యవేక్షణలో పనులు చకచకా సాగుతున్నాయి. నాగోల్-మియాపూర్ 30 కిలోమీటర్ల మెట్రోరైలు మార్గంలో అమీర్‌పేట్ ఇంటర్‌చేంజ్ స్టేషన్ మినహా మిగతా స్టేషన్లు, ట్రాక్‌లు, సిగ్నలింగ్, విద్యుత్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, కోచ్‌లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నాగోల్-మెట్టుగూడ మధ్య ట్రయల్స్ పూర్తి కాగా, మెట్టుగూడ-బేగంపేట మార్గంలో టెస్ట్ నిర్వహించారు. బేగంపేట నుంచి ఎస్సార్‌నగర్ వరకు ట్రయల్స్, టెస్ట్ రన్ నిర్వహించి రైల్వే సేఫ్టీ సర్టిఫికెట్ పొందితే 30 కిలోమీటర్ల మార్గం సిద్ధమైనట్టే. దీనిని మరో 15 రోజుల్లో పూర్తి చేయనున్నారు.
మెట్రోరైలు ప్రారంభానికి ప్రధాని రానుండడంతో మియాపూర్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. ప్రస్తుతం స్టేషన్ సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రంగురంగుల టైల్స్ తో ఫుట్‌పాత్‌ను, స్టేషన్ పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేషన్ పరిసరాల్లో ఉన్న చెట్లకు పెయింటింగ్స్ వేస్తూ మరిన్ని సొబగులు అద్దుతున్నారు. మరింత పచ్చదనం కోసం మొక్కలు నాటుతున్నారు. సర్వీస్ రోడ్లు, ఆటాచ్ రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మెట్రోను ప్రారంభించనున్న ఇనాగ్రల్ ప్లాజాను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు.