ప్రస్తుతం అసెంబ్లీలో రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డికి సీఎం కేసీఆర్ దీటుగా సమాధానమిచ్చారు. రుణ మాఫీ, మద్దతు ధరపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం అడ్డుతలగడం సరికాదన్నారు.
మంత్రి పోచారం మద్దతు ధర పై మాట్లాడుతంటే కాంగ్రెస్ నాయకులు ఓపిక, సంయమనం లేకుండా ప్రవర్తించడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎందుకు అంత తొందర పడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. అందరి సందేహాలను వంద శాతం తీరుస్తామని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. రైతులపై కాంగ్రెస్ కంటే ఎక్కువ బాధ్యత తమకే ఉందని సీఎం అన్నారు.రికార్డు స్థాయిలో ఈసారి రాష్ట్రంలో 48 లక్షల ఎకరాల్లో పత్తి పంటను వేశారన్నారు. మేలు రకం, నాసి రకం అనే రెండు రకాల పంట ఉంటుందని..పత్తి రకాన్ని బట్టి ధర నిర్ణయిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వమే పత్తి ధరను తేమ, రకాన్ని బట్టి నిర్ణయిస్తుందన్నారు. రూ. 16 వేల కోట్లకు పైగా రుణమాఫీ దేశంలో ఎక్కడా జరగలేదన్నారు.