ఏదేమైనా కొత్త సచివాలయం కట్టి తీరుతాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసారు.ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నూతన సచివాలయంపై కేసీఆర్ మాట్లాడారు. భారతదేశంలో 29 రాష్ర్టాలకు సచివాలయాలుంటే.. ఇంత పలికిమాలిన సచివాలయం ఏ రాష్ర్టానికి లేదన్నారు. ఇంత అడ్డదిడ్డమైన సచివాలయాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఏ బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. సెక్రటేరియట్లో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వాన్నంగా ఉందన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైరింజన్ పోయి ఆపరేట్ చేసే స్థలం లేదన్నారు. సీ బ్లాక్ అయితే మరీ దారుణంగా ఉందన్నారు. ఇష్టం వచ్చిన రీతిలో సచివాలయాన్ని కట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైర్ సెఫ్టీ పూర్తిగా లోపించిందన్నారు. దేశంలో ఏ రాష్ర్టానికి పోయినా అక్కడి సచివాలయం ఆ రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా ఉంటుందన్నారు. మనం కూడా అలాగే నిర్మించుకోవాలని చెప్పారు.
సచివాలయం, శాసనసభ, హెచ్‌వోడీల కార్యాలయాలు కట్టాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఈ కాంప్లెక్స్‌లన్నీ రూ. 500 కోట్లలోపే నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. మొదటగా సచివాలయం, శాసనసభను నిర్మిస్తామన్నారు. ఈ నూతన భవనాలకు ప్రధాని నరేంద్రమోదీతో భూమిపూజ చేయిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు అతిసుందరమైన కట్టడాన్ని అందించి ఇస్తామన్నారు. గతంలో కూడా నీలం సంజీవరెడ్డి, బ్రహ్మనందరెడ్డి కూడా ఇప్పుడున్న సచివాలయాన్ని మార్చాలని ప్రతిపాదించారు. కానీ అది అమలు కాలేదన్నారు. ఏదో తాను ఇప్పుడు కొత్తగా చేస్తున్న ప్రతిపాదన కాదని సీఎం స్పష్టం చేశారు.