న్యూయార్క్‌లో ట్రక్కుతో బీభత్సం సృష్టించిన ఉగ్రవాది సైఫుల్లో సైపోవ్.. ఆ తర్వాత పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల రాకను పసిగట్టిన అతడు.. ట్రక్కు నుంచి దిగి పరుగు ప్రారంభించాడు. ఓ చేతిలో తుపాకీ పట్టుకొని అతడు రోడ్లపై ‘అల్లాహో అక్బర్’ అంటూ అరుస్తూ పరుగెత్తుతున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు అతణ్ని షూట్ చేశారు. ఆ కిరాతకుణ్ని సజీవంగా పట్టుకునే ఉద్దేశంతో భద్రతా సిబ్బంది అతణ్ని కడుపులో కాల్చారు. అనంతరం రోడ్డు మీద పడిపోయిన సైపోవ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడికి ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సైఫుల్లో సైపోవ్ 2010లో అమెరికాకు వచ్చినట్లు గుర్తించారు. ప్రారంభంలో అతడు ట్రక్కు డ్రైవర్‌గా పని చేశాడు. ఆ తర్వాత అతడికి గ్రీన్ కార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం అతడు ఉబర్ సంస్థలో డ్రైవర్‌గా చేస్తున్నాడు. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని, సైపోవ్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నామని ఉబర్ సంస్థ వెల్లడించింది.
సైపోవ్‌కు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)తో సంబంధాలున్నట్లు ట్రక్కులో దొరికిన లేఖ స్పష్టం చేస్తోంది. ఆ లేఖపై ఐసిస్ జెండా గుర్తు కూడా ఉంది. అరబిక్ భాషలో రాసిన ఆ నోటును ట్రక్కు నుంచి సీజ్ చేశారు. మన్‌హటన్ ఘటన తర్వాత ట్రక్కు నుంచి ఇంకా ఇతర వస్తువులను కూడా పోలీసులు సేకరించారు. న్యూయార్క్ పోలీసులు మరో కేసులో సైపోవ్‌ను విచారిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.