టీంఇండియా ,కివీస్ ల మధ్య నేడు జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌కు దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ద్వారం స్వాగతం పలకనుంది. ఈ స్టేడియంలోని రెండో గేట్‌కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరూ పేరు పెట్టిన విషయం తెలిసిందే.
నిన్న మంగళవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే డీడీసీఏ చేసిన పెద్ద తప్పిదంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో చాలా రికార్డులు సాధించాడంటూ కొన్ని ఘనతలపై ఏర్పాడు చేసిన బోర్డులో డీడీసీఏ పెద్ద తప్పిదం చేసింది.
‘భారత్ తరఫున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యామ్స్ మెన్ సెహ్వాగ్’ అంటూ రాశారు. కానీ కరుణ్ నాయర్ ను డీడీసీఏ మరిచిపోవడం దుమారం రేపింది. భారత్ నుంచి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించింది ఇద్దరు క్రికెటర్లు కాగా, తొలి ఆటగాడు సెహ్వాగ్, రెండో ఆటగాడు కరుణ్ నాయర్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అందులోనూ ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ కూడా ఐపీఎల్ లో ఢిల్లీ (ఢిల్లీ డేర్ డెవిల్స్) జట్టుకే ప్రాతినిధ్యం వహించినా అతడ్ని డీడీసీఏ ఎలా మరిచిపోతుందంటూ ప్రశ్నిస్తున్నారు.