టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా.. ఆపై జరిగిన రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది. దాంతో వన్డే సిరీస్ ను గెలిచిన ఉత్సాహంతో విరాట్ సేన బరిలోకి దిగుతుండగా, కనీసం టీ 20 సిరీస్ ను సాధించాలనే పట్టుదలతో కివీస్ పోరుకు సిద్ధమవుతోంది. అయితే మూడు వన్డేల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న టీమిండియాకు టీ 20 సిరీస్ ల్లో కూడా గట్టి పోటీ తప్పకపోవచ్చు. న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఫామ్ లేకపోవడం ఆ జట్టును కలవరపరుస్తోంది. దీంతో టీమిండియాతో జరిగే టీ 20ల్లో బోణి కొట్టాలంటే మాత్రం న్యూజిలాండ్ సమష్టిగా రాణించాల్సి ఉంది.