2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్. మొదట భారత్ 250 పరుగులే చేసింది. బలంగా ఉన్న ఇంగ్లాండ్‌కు ఆ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదనుకున్నారంతా. జహీర్, శ్రీనాథ్ బాగానే బౌలింగ్ ఆరంభించారు. రెండు వికెట్లు పడ్డాయి. కానీ నాసిర్ హుస్సేన్,వాన్ నిలదొక్కుకున్నారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతోంది. ఆ స్థితిలో బౌలింగ్ మార్పు చేశాడు గంగూలీ.
అప్పుడు మొదలైంది ఒక చారిత్రక బౌలింగ్ ప్రదర్శన! బెంబేలెత్తించే బౌన్స్.. అంతకుచిక్కని స్వింగ్.. బ్యాట్స్‌మెన్ అటు ఇటు కదల్లేని లైన్ అండ్ లెంగ్త్.. బంతిని ఆడకుండా వదిలే వీల్లేదు.. ఆడితే వికెట్ నిలిచేలా లేదు.. పేస్‌ను బాగా ఆడే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు ఆ బంతులకు. అక్కడ బౌలింగ్ చేస్తున్నది ఓ భారత బౌలరేనా అనిపించేలా డర్బన్‌లో విశ్వరూపమే చూపించాడు ఆ బౌలర్. విరామం లేకుండా పది ఓవర్ల పాటు సాగిన ఆ బౌలింగ్ ప్రదర్శన భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయేదే. ఆ ప్రదర్శన చేసింది ఆశిష్ నెహ్రా.
6/23.. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై నెహ్రా ప్రదర్శన ఇది. అప్పటికి, ఇప్పటికి ప్రపంచకప్‌లో ఓ భారత ఫాస్ట్‌బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన ఇది. కేవలం గణాంకాల పరంగానే కాదు, నాణ్యత కోణంలో చూసినా ఇది అత్యుత్తమ ప్రదర్శనే. ఇలాంటి అనూహ్య ప్రదర్శనలు నెహ్రా కెరీర్లో చాలానే ఉన్నాయి. ఐతే అప్పుడప్పుడూ అనూహ్య రీతిలో చెలరేగిపోయే నెహ్రా.. కొన్నిసార్లు అంతే పేలవంగా బౌలింగ్ చేస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు బంతి ఇస్తే అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసి గెలిపించనూగలడు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో చెత్తగా బౌలింగ్ చేసి మ్యాచ్ పోయేలానూ చేయగలడు. అందుకే అతను ఎప్పుడూ భారత ప్రధాన పేసర్‌గా కొనసాగలేదు. ఐతే భారత క్రికెట్లో ఫాస్ట్‌బౌలర్ల గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు నెహ్రా గురించి మాట్లాడి తీరాల్సిందే. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న జహీర్.. నెహ్రా తర్వాతే జట్టులోకి రావడం విశేషం. కొన్నేళ్ల కిందటే జహీర్ అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడిపోగా.. నెహ్రా మాత్రం ఇంకా భారత జట్టుకు ఆడుతూనే ఉన్నాడు. కోహ్లి జూనియర్ స్థాయిలో ఆడుతుండగా అతిథిగా వచ్చి అతడికి బహుమతి అందించిన నెహ్రా ఇప్పుడు అతడి సారథ్యంలో ఆడుతుండటం గమనార్హం. శ్రీనాథ్, ప్రసాద్ లాంటి నిన్నటి తరం పేసర్లతో.. భువనేశ్వర్, బుమ్రా లాంటి ఈ తరం ఫాస్ట్‌బౌలర్లతో బంతిని పంచుకున్న ఘనత నెహ్రాకే చెందుతుంది.
నిత్య ‘గాయ’కుడు!: క్రికెట్లో అందరికంటే ఎక్కువగా గాయాల పాలయ్యేది ఫాస్ట్‌బౌలర్లే. ఇక నెహ్రా సంగతైతే చెప్పాల్సిన పని లేదు. కెరీర్ ఆసాంతం గాయాల బాధతో సతమతమయ్యాడు. ముఖ్యంగా మోకాలి గాయం తీవ్రంగా వేధించింది. ఎన్నోసార్లు శస్త్రచికిత్సలు జరిగాయి. గాయాల వల్లే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఐదేళ్ల లోపే టెస్టులకు దూరమయ్యాడు. 2004 తర్వాత అతను టెస్టుల్లో ఆడనే లేదు. వన్డేల్లో కూడా జట్టులోకి రావడం, పోవడం అతడికి మామూలైపోయింది. 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అతనాడింది 120 వన్డేలే. అయినప్పటికీ అతణ్ని సెలక్టర్లు పూర్తిగా విస్మరించలేదు. అందుకతడి బౌలింగ్ నైపుణ్యమే కారణం. ఫామ్, ఫిట్‌నెస్ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ 2011 ప్రపంచకప్‌లో అతణ్ని ఆడించారు. పాకిస్థాన్‌తో సెమీఫైనల్లో అతను చక్కటి ప్రదర్శన కూడా చేశాడు. ఐతే ఆ టోర్నీ తర్వాత నెహ్రా వన్డేలే ఆడలేదు.
అంతా మరిచిపోయాక..: 2011 ప్రపంచకప్ తర్వాత ఐదేళ్ల పాటు భారత జట్టు ఛాయల్లోకే రాకపోవడంతో నెహ్రాను అందరూ మరిచిపోయారు. కానీ గత ఏడాది 37 ఏళ్ల వయసులో అనూహ్యంగా అతను మళ్లీ భారత టీ20 జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా, శ్రీలంకలతో సిరీస్‌ల్లో చక్కటి ప్రదర్శన చేశాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ సత్తా చాటాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌పై టీ20లు ఆడాక జట్టుకు దూరమై.. ఇటీవలే ఆస్ట్రేలియాతో సిరీస్‌కు జట్టులోకి పునరాగమనం చేశాడు. ఆ సిరీస్‌లో తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయిన నెహ్రా.. తాను కెరీర్‌ను ముగించాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకున్నాడు. బుధవారం తన సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 మ్యాచ్‌తో ఆటకు గుడ్‌బై చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. ఇకపై నెహ్రా దేశవాళీలు, ఐపీఎల్‌లో కూడా ఆడడు. మొత్తంగా ఆటకే గుడ్‌బై చెప్పేస్తున్నాడు. సుదీర్ఘ కెరీర్లో నెహ్రా ఎన్నడూ వివాదాల్లో తలదూర్చింది లేదు. ఎవ్వరినీ పల్లెత్తు మాట అన్నది లేదు. మైదానంలో హద్దులు దాటింది లేదు. గొప్పగా బౌలింగ్ చేసినపుడు అందరూ తనను పొగిడినా.. పేలవ ప్రదర్శన చేసినపుడు తిట్టిపోసినా.. నెహ్రాలో పెద్దగా స్పందన కనిపించదు. ఏదీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంటాడతను. నెహ్రా మార్కు ఔట్ స్వింగర్లు.. కల్మషం లేని అతడి నవ్వు.. వికెట్ తీసినపుడు విమానంలా సాగే అతడి పరుగు.. ఇవన్నీ ఇకపై చూడలేం. నెహ్రా ఒక దిగ్గజం లాగా గుర్తుండకపోయినప్పటికీ.. భారత క్రికెట్లో ఓ విలక్షణ పేసర్‌గా అతను అభిమానుల మనసుల్లో నిలిచి ఉంటాడనడంలో సందేహం లేదు.
Tags asisnehra bowler retairment TeamIndia