న్యూయార్క్‌లో ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడి 8 మంది ప్రాణాలు తీసిన నిందితుడు సైఫుల్లా సైపో కొన్నేళ్ల క్రితమే అమెరికాలోని ఒహియోకు వచ్చాడు. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కేంట్ నుంచి 2010లో అమెరికాకు వలసవచ్చినట్లు తేలింది. అప్పట్లో ఇతనికి ఇంగ్లిష్ రాదు.
తొలిరోజుల్లో ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. దీనిలో భాగంగా ఇంగ్లిష్‌ను మెరుగుపర్చుకున్నాడు. రాత్రివేళ బాగా ఆలస్యంగా నిద్రించే అలవాటుంది. కొన్నాళ్లకు ఫోర్ట్‌మేయర్స్‌కు వలస వెళ్లాడు. అక్కడ ఉజ్బెకిస్థాన్ నుంచి వలసవచ్చిన మరో వ్యక్తితో కలిసి ఉన్నాడు. అప్పట్లో కొన్నాళ్లు ట్రక్ డ్రైవర్‌గా పనిచేశాడు. తర్వాత కొన్నాళ్లకే న్యూజెర్సీలోని పీటర్సన్‌కు మకాం మార్చాడు. అక్కడ ఉబర్ సంస్థలో డ్రైవర్‌గా చేస్తున్నాడు.
గ్రీన్‌కార్డు కూడా..
సైఫుల్లా గ్రీన్‌కార్డును కూడా సాధించినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. మరోపక్క సైఫుల్లా ఉగ్రదాడిపై ఉబర్ అధికారులు స్పందించారు. ఉద్యోగంలో చేర్చుకునేముందు అతని నేపథ్యాన్ని ఉబర్ పూర్తిగా పరిశీలించిందని పేర్కొంది. దీంతోపాటు ఎఫ్‌బీఐ, ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంది.
తొలుత మావద్దే ఉన్నాడు..
సైపో అరెస్టు తర్వాత అతని ఒకప్పటి సహచరుడు ఇరవై రెండేళ్ల బెఖ్జోద్ అబ్దుసమటోవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతడు అమెరికా వచ్చిన మొదట్లో తమ వద్దే ఉన్నాడని తెలిపాడు. అతడు అమెరికాను బాగా ఇష్టపడతాడని, ఇక్కడ ఉండటాన్ని అదృష్టంగా భావించేవాడని బెఖ్జోద్ తెలిపాడు. అతను అప్పట్లో ఉగ్రవాదిలా అనిపించలేదని తెలిపాడు.
అద్దె ట్రక్కు అది..
లోయర్ మాన్‌హట్టన్‌లో దాడికి ఉపయోగించినట్రక్కును సైపో నిన్ననే న్యూజెర్సీలో అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రక్కుతోనే విచక్షణారహితంగా జనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించాడు. దాడి సమయంలో అతని నుంచి ‘అల్లాహు.. అక్బర్’ అనే మాటలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అతనికి శస్త్రచికిత్స అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ట్రక్కులనే ఆయుధాలుగా చేసుకొని దాడులకి పాల్పడుతున్న విషయం తెలిసిందే.
