ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన చేరబోతున్నారు…విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు.
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. ప్రతిపక్ష పార్టీ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బేసిగ్గా… నాదెండ్ల ఫ్యామిలీది కాంగ్రెస్ పార్టీనే. ఆయన తండ్రి నాదెండ్ల భాస్కర్ ఒక్క నెల ముఖ్యమంత్రిగా చేసింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. నాదెండ్ల ఫ్యామిలీ నుంచి రెండో తరంగా కాంగ్రెస్ లో అడుగు పెట్టిన నాదెండ్ల మనోహర్ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు..
వరుగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా నాదెండ్ల మనోహర్ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో పరాజయం పొందారు. స్థానికంగా ఎంత పట్టు ఉన్నా.. విభజన ఎఫెక్ట్ తో కాంగ్రెస్ నేతగా ఓటమి పాలయ్యారు. ఇక రాజకీయంగా కాంగ్రెస్ లో ఉంటూ లాభం లేదనుకున్నారో ఏమో… ప్రత్యామ్నాయ పార్టీ చూసుకున్నారు మాజీ స్పీకర్. దానికి తోడు వైఎస్ ఫ్యామిలీతో నాదెండ్లకు మంచి అనుబంధం ఉండడంతో… వైసీపీ జెండానే కప్పుకోవాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది..
విభజన తర్వాత చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు టీడీపీ వైపు మొగ్గు చూపారు. స్థానికంగా పట్టు ఉన్న నేతలను ఆహ్వానించేందుకు తెలుగు దేశం పార్టీ కూడా సుముఖత వ్యక్త చేసింది. కానీ నాదెండ్ల మనోహర్ విషయంలో మాత్రం టీడీపీ అంత ఇంట్రస్ట్ చూపించడంలేదు. తెనాలి టీడీపీ నేత రాజాకి మనోహర్ కు మధ్య ఉన్న వైరమే ఇందుకు కారణమంటున్నారు కొంతమంది. ఏది ఏమైనా అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే వచ్చే నెల 4న మనోహర్ వైసీపీలో చేసే అవకాశం కనిపిస్తోంది.