ఏపీలోని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గాడిద మాంసానికి విపరీతమైన గిరాకీ వచ్చింది. చికెన్ కబాబ్, మటన్ కబాబ్ లను ఎలా బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారో.. ఈ నగరాల్లో గాడిద మాంసాన్ని కూడా అదే విధంగా అమ్ముతున్నారు. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షకులు, జంతు పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టుకు కూడా వెళ్లారు.
ఈ పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా కబేళాల్లో గాడిడదలను చంపుతున్నారని, వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారని.. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఏపీ, తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గాడిదల వధను నిషేధించాలని.. అనుమతి లేని కబేళాల మూసి వేతకు ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ వాళ్లు కోర్టును కోరారు.
మొన్నటి వరకూ గాడిద పాలకు గిరాకీ వచ్చిన వైనాన్ని అంతా గమనించారు. ఇప్పుడు గాడిదల మాంసం మీద పడ్డారు జనాలు. ఆవురావురంటూ గాడిద మాంసంతో వండిన వంటకాలను ఆరగిస్తున్నారు. ఊహించుకోవడానికే కొంతమందికి ఇదంతా కంపరంగా ఉండవచ్చు. అయితే తినేవాళ్లకు మాత్రం గాడిద మాంసంలో రుచి దొరికిందంతే!