తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్‌రెడ్డి ఒక రాజకీయ బైరాగి అని, మరోసారి సీఎం కేసీఆర్‌పై నోరుజారితే సహించేదిలేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్చరించారు. వ్యక్తిగత ఎజెండాతో రాజకీయాలుచేసే రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా పనిచేసినది నిజం కాదా? అని ప్రశ్నించారు.
నిన్న సోమవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి డబ్బుతో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్, సండ్ర రాజ్యాంగ ద్రోహులని విమర్శించారు.
ఇలాంటివారిని కాంగ్రెస్ ఎలా చేర్చుకుంటుందని ప్రశ్నించారు. కోదండరాం సహా ఆయనతో ఉన్న వారంతా రాజకీయ నిరుద్యోగులేనని ఎద్దేవాచేశారు. నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకే కొలువుల కొట్లాట సభకు పిలుపునిచ్చారని రవి ఆరోపించారు. నిరుద్యోగుల సాధక, బాధకాలు సీఎం కేసీఆర్‌కు తెలుసునని, ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేముందు విద్యార్థులను రెచ్చగొట్టి కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. నిరుద్యోగులు కోదండరాం ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తిచేశారు.