గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు . ఇవాళ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ .. టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత కోట్లాది రూపాయిలు ఖర్చుపెట్టి విద్య, వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్ ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా వాసిగా మహాత్మాగాంధీ మెమొరియల్ ఆస్పత్రిని దశాబ్దాల కాలంగా చుట్టుపక్కలున్న ఐదారు జిల్లాల ప్రజలకు వైద్య సదుపాయం అందిస్తోందని ఈ సందర్భంగా కొండా సురేఖ తెలియజేశారు.
అయితే ఈ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయలు ఉన్నప్పటికీ డయాలసిస్ విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులున్నాయని.. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి లక్ష్మారెడ్డి కి విన్నవించారు. ఎంజీఎం ఆస్పత్రిలో లిఫ్ట్ సౌకర్యం లేకపోవడంతో డయాలసిస్ యూనిట్ మొదటి అంతస్థుకు వెళ్లడానికి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆస్పత్రికి రాలేక రోగులంతా ప్రైవేటు ఆస్పత్రికి వెళుతున్నారు.డయాలసిస్ యూనిట్‌కు గాను ఒక బిల్డింగ్ మంజూరు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ.. ఇప్పుడున్న దానికంటే ఎక్కువ మందికి వైద్య సదుపాయం అందించే విధంగా మంత్రి చర్యలు తీసుకుని తగిన సిబ్బందిని రిక్రూట్ చేయాలని కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.