మావోయిస్ట్ సమస్యను ఎలా ఎదుర్కోవాలో దేశానికి దిశానిర్దేశం చేసిన ఘనత తెలుగు నాలుగో సింహానిది. కానీ ఇప్పుడు నాలుగో సింహం వేటమానేసింది. టీడీపీ ప్రయోజనాలకు కాపాడేందుకు సింహాలు లోకల్‌లో పనిచేస్తున్నాయి. టీడీపీ నేతలు ఎంత పెద్ద నేరం చేసినా నో కేసు, నో అరెస్ట్. అదే ప్రతిపక్షానికి చెందిన నాయకులైతే సెక్షన్లతో కూడా పనిలేదు. నడిరోడ్డుపై ఈడ్చి కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు మరో నిదర్శనం…. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడి ఉదంతమే.
పత్తికొండ వైసీపీ ఇన్‌చార్జ్ నారాయణరెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా కేఈ కుమారుడు శ్యాంబాబు ఉన్నారు. సూత్రధారి అయినప్పటికి కేసులో ఆయను ఏ-14గా చేర్చారు. హత్య జరిగి నెలలు గడుస్తున్నా శ్యాంబాబు అరెస్ట్ మాత్రం లేదు. ఇందుకు కేఈ శ్యాంబాబు పరారీలో ఉన్నారని పోలీసులు సమాధానంగా చెబుతున్నారు. కానీ ఆయన కనించనిది కేవలం నాలుగో సింహాలకు మాత్రమే. శ్యాంబాబు ఎంచక్క బయట తిరుగుతూ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఏకంగా కుటుంబసభ్యులతో కలిసి గౌరీ నోములు పోసుకుంటున్నారు. ఆ ఫొటోలను వైసీపీ పత్తికొండ ఇన్‌చార్జ్, నారాయణరెడ్డి భార్య శ్రీదేవి మీడియాకు విడుదల చేశారు.
కార్యక్రమానికి కేఈ కృష్ణమూర్తి కూడా రావడంతో పోలీసులు భారీగా వారికి కాపు కాస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి వద్దే ఉన్నారు. వారి కళ్ల ముందే శ్యాంబాబు దర్జాగా తిరుగుతున్నా ఒక్కరు కూడా ఆయనపై కేసు ఉంది…. అరెస్ట్ చేయాలన్న ఆలోచన చేయలేదు. ఈ పరిస్థితిని చూసి నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులే బాధపడుతున్నారు. నేరం చేసిన వ్యక్తి కళ్లముందే ఉన్నా…. అరెస్ట్ చేయకుండా తిరిగి అతడికే రక్షణగా పోలీసులు ఉండాల్సి రావడం వంటి దౌర్భాగ్య సన్నివేశాలను ఇంతకాలం సినిమాల్లో మాత్రమే చూశామంటున్నారు. అదన్న మాట ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ దుస్థితి.