ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత మూడున్నర ఏండ్లుగా ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నవిషయం విదితమే .తాజాగా ఆయన మరోసారి తన దాష్టీకాన్ని ప్రదర్శించారు. జిల్లాలోని ఏలూరు మండలం దెందులూరు నియోజకవర్గంలో మల్కాపురంలో ఎమ్మెల్యే చింతమనేని ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ క్రమంలో ఆయన స్థానిక వైసీపీ నేత తూతా నిరంజన్ ఇంటికి చేరుకున్నారు.
అయితే ,నిరంజన్ ఇంటి వెనుక భాగంలో ప్రహరీగోడకు పశువులను కట్టేందుకు ఏర్పాటు చేసుకున్న ఇనుప కొంకాలను పీకించారు.అక్కడితో ఆగకుండా వెనువెంటనే ప్రభాకర్ వెనక భాగం గేటు తెరుచుకుని లోపలికి ప్రవేశించారు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు కల్సి క్లోజ్ చేసి ఉన్న ఇంటి ప్రధానద్వారం తలుపులు కొట్టి కేకలు పెడుతూ ఇంటిలో ఉన్న నిరంజన్ భార్యను బయటకు పిలిచి మరి మహిళా అనే విషయం మరిచి నోటికి వచ్చినట్లు అందరి ముందే తీవ్రస్థాయిలో పదజాలంతో దుర్భాషలాడుతూ ఇల్లంతా తిరిగారు.
ఒకవైపు ఇంత అలజడి సృష్టిస్తూనే మరోవైపు ఇంటి వెనక ఉన్న పంచాయతీ కుళాయిని గుర్తించి మరి కుళాయికి ఏర్పాటు చేసిన మోటార్ విద్యుత్ వైర్లను కట్ చేయమంటూ విద్యుత్ శాఖ సిబ్బందిని ఆదేశించారు. దీంతో వారు వైర్లు కట్ చేశారు. రోడ్డు పక్క పశువులు కట్టి, కుళాయికి మోటార్ బిగిస్తే చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ అధికారులను ఆదేశిస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదంతా చూసిన స్థానికులు ఖిన్నులయ్యారు. గ్రామంలో 90 శాతం కుళాయిలకు మోటార్లు బిగించి ఉన్నాయని, వాటినన్నీ వదిలేసి వైసీపీ నాయకుడి ఇంటిలోని మోటార్ వైర్లు తొలగించడం అన్యాయమని స్థానికులు పేర్కొన్నారు.