శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పోలీసు శాఖపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమాధానం ఇచ్చారు.హైదరాబాద్ వేదికగా రూ. 350 కోట్ల అంచనాతో అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు . భారతదేశ చరిత్రలోనే ఇదొక అపూర్వఘట్టమని అయన అన్నారు . దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని హోంమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం చేరే విధంగా నిర్మాణం జరుగుతుందన్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌కే కాకుండా ఇతర డిపార్ట్‌మెంట్‌లకు ఉపయోగపడే విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ పని చేస్తుందన్నారు. అన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు నిర్మిస్తామని ప్రకటించారు.
హైదరాబాద్ పోలీసులు.. దేశంలోనే నెంబర్‌వన్ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారని గుర్తు చేశారు నాయిని. పోలీసు శాఖను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసు వ్యవస్థను ఆధునీకరించేందుకు కొన్ని వందల కోట్ల రూపాయాలు వెచ్చిస్తున్నామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పోలీసు స్టేషన్లను నిర్మిస్తున్నామని చెప్పారు. పోలీసు స్టేషన్ల నిర్వహణకు నగరంలో నెలకు రూ. 75 వేలు, అర్బన్‌లో రూ. 50 వేలు, రూరల్‌లో రూ. 20 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో సమీకృత ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. షీ టీమ్స్‌తో హైదరాబాద్‌లో మహిళల భద్రత మెరుగుపడిందని అనేక సర్వేలు తేల్చాయని గుర్తు చేశారు.