30 ఏళ్ల క్రితం పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో లారీలు ఆపి దోపిడీ చేయడం ఆ దొంగపని. అప్పుడు ఆ దొంగ వయసు 19 ఏళ్లు. ఇప్పుడు సుమారు 50 ఏళ్లుంటాయి. అయినా ఆ దొంగను గుర్తించి పట్టుకున్న సంఘటన సోమవారం జరిగింది. సీఐ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అంబటి మల్లికార్జునరెడ్డి బృందం 1988లో పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో దారికాచి దొంగతనాలు, లారీలను ఆపి దోపిడీలు చేస్తుండేవారు. అప్పుడే మల్లికార్జునరెడ్డిపై కేసు నమోదైంది. అప్పటినుంచి అతడిని అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించే క్రమంలో ఈ దొంగ కేసు బయటపడింది. ఎలాగైనా ఈ దొంగను పట్టుకోవాలని సీఐ నిర్ణయించుకుని ఓ బృందాన్ని పాత ఫొటో ఇచ్చి కర్నూలుకు పంపారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కర్నూలులో దోపిడీదొంగ మల్లికార్జునరెడ్డిని అరెస్ట్ చేసి పిడుగురాళ్లకు తీసుకువచ్చారు. ఈ విషయం సత్తెనపల్లి డీఎస్పీకి తెలియడంతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసును ఛేదించినందుకు సీఐ హనుమంతరావును, ఎస్‌ఐ హరిబాబును, పోలీసు బృందాన్ని అభినందించారు.