తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి అనుముల రేవంత్‌రెడ్డి రాజీనామా చేయడంతో త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతున్నది. ఈ నెల 27న స్పీకర్ ఫార్మాట్‌లో రేవంత్‌రెడ్డి చేసిన తన రాజీనామా పత్రాన్ని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
అయితే నవంబర్ 2న టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో టీటీడీపీ నేతలతో సమావేశం నిర్వహించి, అదేరోజు రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పిస్తారని సమాచారం. ఆ వెంటనే దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే కొడంగల్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన ప్రతిఎన్నికలోనూ టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్నది.
కొడంగల్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. రేవంత్ టీడీపీని వీడుతున్నారనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు అధికమయ్యాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు టీఆర్‌ఎస్‌లో చేరారు.