రేపటి నుండి టీం ఇండియా ,కివీస్ ల మధ్య జరగనున్న మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా దేశ రాజధాని నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపు రాత్రి గం.7.00 ని.లకు మొదటి టీ 20 ఆరంభం కానుంది. ప్రస్తుతం వన్డే సిరీస్ ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇప్పుడు టీ 20 సిరీస్ పై కన్నేసింది.
ఇప్పటివరకూ ఓవరాల్ గా న్యూజిలాండ్ తో ఆడిన ఐదు టీ 20ల్లోనూ ఓటమి పాలైన టీంఇండియా తాజా సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లోనే శుభారంభం చేసి పైచేయి సాధించేందుకు కసరత్తులు చేస్తోంది. అయితే కివీస్ తో జరిగే టీ 20 సిరీస్ ను భారత గెలిస్తే కనుక తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుంటుంది.
ఒకవేళ కివీస్ పై సిరీస్ ను గెలిచిన పక్షంలో ఆ ఫార్మాట్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో ఉన్న భారత జట్టు రెండో ర్యాంకుకు చేరుతుంది. దీంతో ప్రస్తుతం టీ 20 ర్యాంకింగ్స్ లో టాప్ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తన ర్యాంకును కోల్పోతుంది. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న దాయాది దేశమైన పాకిస్తాన్ టాప్ ర్యాంకు చేరుతుంది.