టీఎస్‌పీఎస్సీ ఈ నెల 28న విడుదలచేసిన 2011 గ్రూప్ -1 ఫలితాలను సోమవారం ఉపసంహరించుకున్నది. తమ ఆప్షన్లను పరిగణనలోనికి తీసుకోలేదంటూ ఇద్దరు అభ్యర్థులు ఫిర్యాదు చేయటంతో టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నది. అభ్యర్థుల ఫిర్యాదుపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డైరెక్టర్ జనరల్ రాజేంద్రనిమ్జే, డైరెక్టర్ విజయకరణ్‌రెడ్డితో సమావేశమైన టీఎస్‌పీఎస్సీ వారి వివరణ కోరింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో సాంకేతిక పొరపాట్ల కారణంగా తారుమారైనట్టు గుర్తించారు. ర్యాండమ్‌గా చెక్‌చేసే ప్రక్రియలో డేటాలోని పోస్టుల ప్రాధాన్యతలు తారుమారు అయ్యుంటాయని భావిస్తున్నారు. సీజీజీ నుంచి పూర్తినివేదిక వచ్చే వరకు గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపిక జాబితాను రద్దు చేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. తుది ఫలితాలు వెల్లడించిన వారంరోజులకు ఇంటర్వ్యూకు హాజరైనవారి మార్కుల జాబితాను కూడా విడుదలచేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టంచేసింది.
