తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత ప్రధానమైన హైడ్రాలజీ అనుమతులు లభించాయి. కేంద్ర జలవనరుల సంఘం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు రావడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు వంటిదని హరీశ్ రావు అన్నారు. ఇదే స్ఫూర్తితో మిగతా అనుమతులు త్వరగా సాధించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
