ఈ ఏడాది పత్తి ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉండటంతో రైతులు మార్కెట్‌కు తెస్తున్న పత్తికి గిట్టుబాటు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆర్థిక మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఇవ్వాళ రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలతో సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రైతన్నకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. ఇందు కొరకు జిన్నింగ్ మిల్స్ పరిశ్రమకు అవసరమైన సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు కూడా ఇదే పిలుపును ఇచ్చారు. మంత్రుల పిలుపుకు స్పందించిన జిన్నింగ్ మిల్స్ సంఘ అధ్యక్షుడు శ్రీ రవీందర్ రెడ్డి తమకు ప్రభుత్వం నుండి రావలసిన ప్రోత్సాహకాలను సత్వరం విడుదల చేయాలని కోరారు. అట్లాగే తమ పరిశ్రమ వృద్ధికి మరికొన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.జిన్నింగ్ పరిశ్రమ ప్రతినిధుల విజ్ఞప్తికి మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సుమారు రు. వంద కోట్ల ప్రోత్సాహకాల బకాయిలు వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు.రాష్ట్రంలో కొన్ని ఖాయిలాపడ్డ జిన్నింగ్ మిల్స్ ఉన్నాయని, వాటిని కూడా సత్వరం తెరిపిస్తే మార్కెట్లలో ఇంకొంత పత్తిని కొనుగోలు చేయవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. ఖాయిలాపడ్డ జిన్నింగ్ మిల్స్‌ను కూడా తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీచేశారు.
తెలంగాణ ప్రభుత్వం కొంతకాలం క్రితం ప్రారంభించిన ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ వ్యవస్థను ఈ ఖాయిలాపడ్డ జిన్నింగ్ మిల్స్‌ను పునఃప్రారంభించేందుకు ఉపయోగించుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ వేసిన పెనల్టీలను కూడా ఎత్తివేయాలని పరిశ్రమ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని జిన్నింగ్ పరిశ్రమ ప్రతినిధులు రేపటి నుండే మార్కెట్లో పత్తి రైతుల నుండి కొనుగోళ్లు పెంచాలని మంత్రులు కోరారు.ఇటీవల తాను గుజరాత్ లో జరిగిన ఒక సమావేశంలో సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సెంథిల్ కుమార్ ను కలిసినప్పుడు ఆయన తెలంగాణలో పండిస్తున్న పత్తి దేశంలోనే అత్యుత్తమమైన నాణ్యత కలిగి ఉంటుందని తనతో చెప్పారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మరి అంత నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతన్నను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్స్ యజమానులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే త్వరలోనే రాష్ట్రంలో సకల హంగులతో కూడిన డిలింట్, సాల్వెంట్ పరిశ్రమ పార్కును నెలకొల్పుతామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.
వరంగల్ లో ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో తమకు కూడా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని జిన్నింగ్ మిల్స్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.