మహిళల అందాల పేరుతో వ్యాపారం చేస్తే సహించేది లేదని విశాఖలో మహిళలు సాగర కెరటంలా ఎగసి పడ్డారు. వారి ఉద్యమం దెబ్బకు మిస్ వైజాగ్ పోటీలు వాయిదా పడ్డాయి. ఆదివారం జరగాలిసిన ఈ పోటీలకు నిరసన వ్యక్తం చేస్తూ మహిళా, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. పోటీలు తలపెట్టిన ప్రాంతాన్ని దిగ్బంధనం చేశాయి. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించే సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇది గమనించి నిర్వాహకులు పోటీలు వాయిదా వేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇక మరోవైపు టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు పై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఒక పక్క సేవ్ గర్ల్ అంటున్నారు మరో పక్క మహిళల అంగాంగ ప్రదర్శనలతో వ్యాపారాలు చేస్తున్నారు . ఎన్నాళ్లు అంగడి బొమ్మలుగా స్త్రీలను చిత్రీకరిస్తారు. వారిని విద్యా పరంగా ఆర్థికపరంగా ఎదగనివ్వరా అంటూ మహిళామణులు నిలదీశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు.. అంగాంగాలకు ప్రైజ్ లు పెట్టి ఇలాంటి పోటీలు నిర్వహిస్తూ మహిళల హక్కులు హరిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపించాయి.