ఏపీలో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులకు న్యాయం చేయాలంటూ ఆదివారం చేపట్టిన ‘చలో గరగపర్రు’ కార్యక్రమంతో గరగపర్రులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హైటెన్షన్ నెలకొంది. అనుక్షణం ఉత్కంఠ రేపింది. ఓవైపు పోలీసులు అందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు జల్లెడ పడుతుంటే మరోవైపు దళితులు అంబేద్కర్ విగ్రహం శంకుస్థాపన కోసం ప్రయత్నాలు చేశారు. పోలీసుల సంచారం, వారి వాహనాల సైరన్లతో గ్రామంలో భయందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ ఘటనలో మంత్రులు హామీలిచ్చినప్పటికీ నేటికి పూర్తిస్థాయిలో అమలుకాలేదు. దీంతో దళిత, బహుజన, ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్వర్యంలో ఆదివారం చలో గరగపర్రుకు పిలుపునిచ్చాయి. అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఈ శంకుస్థాపనకు ఎలాంటి అనుమతులూ లేవని ఇక్కడకు వచ్చే వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గ్రామంతో పాటు వివిధ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించి అనుమానితులుగా కనిపించిన వారిని చెక్ పోస్టుల వద్ద నిలుపుదల చేశారు.
దళితులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గొర్ల రామకృష్ణను గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకుని వీరవాసరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రామంలోకి రాకుండా ఎక్కడివారినక్కడే నిలిపేశారు. దళితులు అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వంతెన సమీపంలో భారీగేట్లు ఏర్పాటు చేసి మోహరించారు. గ్రామంలో సెక్షన్-144, పోలీసు యాక్ట్ 30 అమలు చేశారు. ఆరుగురు డిఎస్పిలు, 13 మంది సిఐలు, 38 మంది ఎస్ఐలు, 60 మంది ఎఎస్ఐలు, వంద మంది ఎపిఎస్పి ప్రత్యేక బలగాలు, 400 మంది కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు మోహరించారు. గ్రామంలోకి వెళ్లేవారిని గుర్తింపుకార్డులు చూపాలంటూ ఇబ్బందులకు గురిచేశారు.
రాజమండ్రి, గుంటూరు, అత్తిలి, ఏలూరుతో పాటు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సైతం చెక్‌పోస్టుల వద్ద నిలుపుదల చేశారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పొలాలకు వెళ్లే మార్గంలో పోలీసులు మోహరించి రైతులను సైతం గుర్తింపుకార్డులు అడగడంపై తీవ్ర అసహనం వ్యక్తమైంది. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నవంబర్ 24 నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని దళితులు హెచ్చరించారు. కొద్దిమందికి మాత్రమే పరిహారాన్ని అందించి 37 కుటుంబాలకు అందించలేదన్నారు. యాకోబు కుటుంబానికి సైతం నష్టపరిహారం అందించలేదని పేర్కొన్నారు. పాత పంచాయతీ కార్యాలయం వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యమాన్న కొనసాగిస్తామని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు గొర్ల రామకృష్ణ అన్నారు.