ప్రస్తుతం తెలుగు సినీ రాజకీయాల్లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు ఓ రేంజ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దివంగత మాజీ సీఎం.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ రోల్‌లో తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి.
ఇక మరోవైపు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కోణంలో తెరకెక్కిస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండోది. ఇక తమిళనాడు తెలుగుయువత అధ్యక్షుడు అయిన కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు కౌంటర్‌గా లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాను తెరకెక్కిస్తున్న టైటిల్‌తో సహా ఎనౌన్స్ చేసి మరో సంచలనం రేపారు. ఈ సినిమాలో సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ మూడు సినిమాల్లో బాలయ్య – తేజ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఎన్టీఆర్ రోల్‌ను ఆయన తనయుడు బాలకృష్ణ పోషిస్తుండడంతో సహజంగానే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే స్క్రిఫ్ట్ వర్క్ కంప్లీట్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా వచ్చే యేడాది ఫిబ్రవరిలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో మరో నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ ఓ కీలకపాత్రకు ఎంపికయ్యాడు. ఇంతకు కళ్యాణ్‌రామ్ పోషించేది ఎవరి రోలో కాదు ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ పాత్రే కావడం విశేషం. ఇది నిజంగానే నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.ఇక కీలకమైన చంద్రబాబు రోల్‌కు సీనియర్ హీరో జగపతిబాబు పేరును ఫైనలైజ్ చేశారు.