వివాదాలకి కేరాఫ్ మిస్టర్ జీనియస్ రామ్ గోపాల్ వర్మ ఏ ముహుర్తాన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రకటించారో.. అప్పటి నుండి ఆ చిత్రం పై వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే టీడీపీ నేతలకు- వర్మకు మధ్య యుద్ధం కొనసాగుతుండగా తాజాగా లక్ష్మీ పార్వతి వర్మకు వార్నింగ్ ఇచ్చారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించి, ఆనాటి సంగతులని నేటి తరానికి చెప్పాలనుకున్న రాంగోపాల్ వర్మ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. వర్మ తనని ఇంతవరకు కలవలేదు. తనని కలిసి చర్చిస్తే, ఎన్టీఆర్ జీవితంలోని మరిన్ని విశేషాలని ఆయనకి వివరిస్తా. వర్మ ఉన్నది ఉన్నట్టుగా చెబితే పర్వాలేదు కానీ అలా కాకుండా ఆ సినిమా ఏ మాత్రం తేడాగా వున్నా… వర్మ మళ్లీ పాత లక్ష్మీపార్వతిని చూడాల్సి వుంటుందని హెచ్చరించారు.
తనని ఎవరు, ఎలా విమర్శించినా…. వారికి తనదైన స్టైల్లో ఘాటుగా కౌంటర్ ఇచ్చే అలవాటున్న వర్మ ఈసారి లక్ష్మీ పార్వతికి ఎలాంటి రిప్లై ఇస్తారో అని సర్వత్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న వర్మ.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నాగ్ సినిమాను రిలీజ్ చేసి ఆ తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తానని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలోగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పూర్తయి ఆడియెన్స్ ముందుకు వస్తుందని వర్మ తన ప్రకటనలో పేర్కొన్నాడు.