రాజకీయ నాయకులు పబ్లిక్ ఫంక్షన్లలో కార్యకర్తలతో కలిసి భోజనం చేయడం, వారి భుజాలపై చేతులు వేయడం సర్వసాధారణమే. కానీ, కార్యకర్తలను ఇంటికి పిలిచి, తమతోపాటు భోజనం పెట్టించడం ఎక్కడా కనిపించదు. ఇలాంటి నాయకులున్న రోజుల్లో విలువలతోకూడిన రాజకీయాలు, నాయకత్వ లక్షణాలు, మానవత్వం, మంచితనం అంటే ఏమిటో మరోసారి చేతల్లో చూపించారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. ఎక్కడో మారుమూల అటవీ గ్రామంలో అష్టకష్టాలు పడుతున్న ఓ మహిళా కార్యకర్తను ఇంటికి పిలిపించుకొని, ఆమెతో కలిసి భోజనం చేశారు. కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆర్థికసాయం అందించారు. మంచిరోజులు వస్తాయని, అధైర్యపడవద్దని ధైర్యంచెప్పారు. ఇది ఓ నిరుపేద గిరిజన మహిళకు ఎదురైన అనుభవం. భూక్య లక్ష్మి, గంగారాం దంపతులది జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామం. ఈ నిరుపేద గిరిజన దంపతులు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భవానికి కొద్దిరోజుల ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యంగా లక్ష్మి పోటీచేయాల్సి వచ్చింది. రాయికల్ మండలం బోర్నపెల్లి ఎంపీటీసీ స్థానంలో టీఆర్‌ఎస్‌కు గిరిజన మహిళ అభ్యర్థి లభ్యంకాకపోవడంతో ఆమెను ఒప్పించి రంగంలోకి దింపారు.
స్థానికురాలు కాకపోవడం, ఆర్థికంగా లేకపోవడంతో కొద్దితేడాతో ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత విజయం కోసం లక్ష్మి, గంగారాం దంపతులు పనిచేశారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత కవిత ఆదరించినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు లభించలేదు. రెండేండ్ల క్రితం గంగారాం మృతిచెందారు. కొడుకు, కూతురును పోషించాల్సిన బాధ్యత లక్ష్మిపై పడింది. ఆమెను ఆదుకోవాలని కవిత స్థానిక నాయకులకు సూచించారు. కానీ, పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. పదిరోజుల క్రితం ఎంపీ కవిత ఇంట్లో జరిగిన ఒక శుభకార్యానికి లక్ష్మిని కూడా ఆహ్వానించారు. దీంతో ఈ నెల 21న హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడ సీఎం కేసీఆర్‌ను దగ్గరగా చూసిన లక్ష్మి తన పరిస్థితిని వివరిస్తూ రూపొందించిన విజ్ఞాపనలేఖను అందజేశారు. అక్కడే లేఖను చదివిన సీఎం కేసీఆర్ దానిని తనతోపాటే తీసుకువెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే లక్ష్మికి ఫోన్‌చేసి, ప్రగతిభవన్‌కు రావాలని స్వయంగా కేసీఆరే ఆహ్వానించారు. దాంతో ఆమె తమ గ్రామస్థులతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. సీఎం లక్ష్మితో పది నిమిషాలు మాట్లాడారు. ఆదివారం వరంగల్ వెళ్తున్నానని, మళ్లీ ఫోన్ చేస్తాను రావాలని చెప్పారు. లక్ష్మి ఇటిక్యాల వెళ్లిపోయారు. రెండ్రోజుల తర్వాత సోమవారం సీఎం కార్యాలయం నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. రేపు మధ్యాహ్నం కల్లా సీఎం ఇంటికిరావాలని ఆహ్వానించారు.
కుటుంబంతో కలిసి వచ్చి ముఖ్యమంత్రితో భోజనం
కూతురు, అల్లుడుతో కలిసి మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరిన లక్ష్మి మధ్యాహ్నం ఒంటిగంటకల్లా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. అదేసమయంలో భోజనానికి సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్ లక్ష్మి కుటుంబసభ్యులను కూడా భోజనానికి ఆహ్వానించారు. లక్ష్మి తటపటాయించడంతో అమ్మా.. అన్నం ముందు అంతా సమానమే అమ్మా.. అంటూ స్వయంగా భోజనానికి తీసుకువెళ్లి ఆమెతో కలిసి కూర్చొని భోజనంచేశారు. శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అంశంపై చర్చించటానికి ప్రగతిభవన్‌కు వచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నాయకులు, ప్రజాప్రతినిధులకు ఆమెను పరిచయంచేశారు. లక్ష్మి మన కార్యకర్త. నాన్‌లోకల్ అయినప్పటికీ మన తరుఫున పోటీచేసింది. ఓడిపోయింది. భర్తను పోగొట్టుకుంది. మీరు సాయం చేయరా? పట్టించుకోరా? ఇదేం పద్ధతి? అంటూ సుతిమెత్తగా మందలించారు. కార్యకర్తల మంచిచెడులను పట్టించుకోవాలి. వారిని ఆదరించాలి. అండగా నిలువాలని హితబోధచేసి, లక్ష్మికి ఆర్థికసాయం అందజేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. ఇటిక్యాలకు అధికారులను పంపించి, ఆమెకు ఏం కావాలో తెలుసుకోవాలని, వీలైతే మోడల్‌హౌజ్ నిర్మించాలని కలెక్టర్ శరత్‌ను ఆదేశించారు. సీఎం ఆదరణను చూసిన లక్ష్మి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం సార్ దేవునోలె కలిసిండు
సీఎం కేసీఆర్ దేవునోలె కలిసిండు. నేను రాసుకున్న ఉత్తరం ఇచ్చిన. పట్టించుకుంటడు అనుకోలే. అమ్మా. అన్నం ముందు అంతా ఒక్కటే తిను అని చెప్పి, అన్నం పెట్టిండ్రు. సీఎంసార్‌తోటి కలిసి కూసొని అన్నం తినే భాగ్యం దక్కింది సార్. ఇక్కడ చిన్నచిన్న సార్లే ఇంట్లకు రమ్మని అన్నంపెట్టరు. గట్లాటిది పెద్దసార్ గంత ప్రేమగా అన్నం తినమన్నడు. నిజంగా సీఎం సార్ దేవుడు. సార్ చూపిన అభిమానం జీవితంలో ఎప్పుడు యాదికి ఉంటది. సచ్చెటప్పుడు గూడ సార్‌ను యాదిజేసి సత్త సార్.
– లక్ష్మి, ఇటిక్యాల గ్రామం