వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో తలపెట్టిన మహాపాదయాత్ర విజయవంతం కావాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుమ్మలగుంట నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణికి సోమవారం కాలినడకన యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే . ఈ యాత్రను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.వంద కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర పల్లెల మీదుగా కొనసాగింది. ప్రతి గ్రామంలోనూ ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యేతోపాటు నడిచారు. గ్రామాల నుంచి తరలివచ్చిన జనంతో తిరుచానూరు జనసంద్రమైంది. అక్కడినుంచి వేలాదిమందితో ఈ యాత్ర ముందుకు సాగింది. సాయంత్రానికి పుత్తూరుకు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బసచేసి మంగళవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి సాయంత్రానికి తిరుత్తణికి చేరుకుంటారు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని, అందులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని తిరుత్తణి సుబ్రమణ్యస్వామికి ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
దేశ చరిత్రలోనే అతిపెద్ద యాత్ర : ఎంపీ మిథున్‌రెడ్డి
దేశ చరిత్రలో ఏ ప్రతిపక్ష నేత కూడా మూడువేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసిన దాఖలాలు లేవని,వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసే ప్రజాసంకల్ప మహా పాదయాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. జగన్‌కు మద్దతుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తమిళనాడులోని తిరుత్తణికి యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. జగన్ కోసం, వైఎస్సార్సీపీ కోసం నిరంతరం తపించే నిజమైన సైనికుడు చెవిరెడ్డి అని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం తపించే నేత జగన్ అని ఎమ్మెల్యే నారాయణస్వామి ప్రశంసించారు.