ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీ- ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మధ్య ఫైట్ చాలా టఫ్‌గా జరగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇక టీడీపీ మంత్రి అఖిల ప్రియ సొంత నియోజక వర్గం ఆళ్లగడ్డలో ఈసారి గట్టి ఫైట్ జరిగేటట్లు ఉంది. దీంతో అక్కడ అఖిలప్రియకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి గట్టి పట్టుంది. ఆళ్లగడ్డ అంటే రెండు రెండు కుటుంబాలు గుర్తుకు వస్తాయి. ఒకటి భూమా ఫ్యామిలీ కాగా, రెండోది గంగుల కుటుంబం.
ఇక భూమా శోభానాగిరెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ప్రచారంలో ఆమె రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో శోభానాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే హటాత్తుగా నంద్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భూమా నాగిరెడ్డి కూడా మరణించడంతో ప్రస్తుతం ఆ ఫ్యామిలీకి అఖిలప్రియే పెద్దదిక్కయ్యారు. అయితే భూమా కుటుంబాన్ని ఆళ్లగడ్డలో ఢీకొనే సత్తా ఒక్క గంగుల ఫ్యామిలీకే ఉంది. ఇటీవల గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరారు.
అయితే గత కొంతకాలంగా ఆళ్లగడ్డలో గంగుల ప్రభాకర్ రెడ్డి తనయుడు విజయేంద్ర రెడ్డి అలియాస్ నాని విస్తృతంగా పర్యటిస్తున్నారు. గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గంగుల నాని పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. డిగ్రీ చదివిన నాని తండ్రి వద్దనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఈసారి తనయుడిని బరిలోకి దించాలని గంగుల ప్రభాకర్ రెడ్డి గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే విజయేంద్రరెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తన క్యాడర్‌ను జారిపోకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నారు.
వైసీపీ అధినేత జగన్ నుంచి కూడా నానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో గడప గడపకూ వైసీపీ, నవరత్నాల సభలను నాని నిర్వహించారు. జగన్ పాదయాత్ర ఆళ్లగడ్డ వస్తున్న సందర్భంగా విజయేంద్రరెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అఖిలప్రియ మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గానికి పెద్దగా ఏమీ చేయలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. నాని ఫుల్ గా తిరుగుతుండటంతో అఖిలప్రియ కూడా నియోజకవర్గానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మొత్తం మీద ఈసారి ఆళ్లగడ్డలో పోటీ నువ్వా.. నేనా అన్నట్లే ఉంటుందన్నది విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.