వచ్చే ఐదేళ్లలో 150 బిలియన్ల డాలర్ల పెట్టుబడితో 10 లక్షల మందికి రైల్వే ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైల్వేను సరికొత్త పంథాలో నడిపిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఒక్క రైల్వేశాఖలోనే రూ.9.75లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. వీటి ద్వారా 10లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనకు 2015లో అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్ప్రభు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రస్తుతం రైల్వేశాఖకు 8.5లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని, ఇందుకోసం విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించినట్టు వెల్లడించారు. దేశమంతటా రైల్వేలైన్ల విద్యుదీకరణను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
