నటి లావణ్య త్రిపాఠికి కోలీవుడ్ నిర్మాతల సంఘం రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తమిళ వర్గాల సమాచారం. తెలుగులో వచ్చిన ‘100%లవ్’ చిత్రాన్ని తమిళంలో ‘100% కాదల్’గా రీమేక్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో జి.వి. ప్రకాశ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కథానాయికగా తొలుత లావణ్య త్రిపాఠిని ఎంపికచేసుకున్నారు. రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది అనుకుంటున్న సమయంలో కొన్ని కారణాల వల్ల లావణ్య సినిమా నుంచి తప్పుకొంది. దాంతో అప్పటికప్పుడు చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చిందట. కానీ అప్పటికే నిర్మాతలకు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.
దాంతో లావణ్యపై ఆ రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తమిళ వర్గాలు అంటున్నాయి. మరోపక్క ఈ చిత్రంలో కథానాయికగా ‘అర్జున్‌రెడ్డి’ ఫేం షాలిని పాండేను ఎంపికచేసుకున్నారు. జరిమానా విషయమై లావణ్య నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.
లావణ్య నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ చిత్రంలో ఆమె రామ్‌కు జోడీగా నటించారు. త్వరలో ఆమె ‘సుప్రీం’ హీరో సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా ఓ చిత్రంలో నటించనున్నారు.
