కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి భార్య అంటే.. ఏ నిర్మాతగానో, దర్శకురాలిగానో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారంతా. అయితే ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది కుట్టి రాధిక. కన్నడ సీనియర్ హీరో, దర్శకుడు రవిచంద్రన్ హీరోగా నటిస్తున్న సినిమాలో రాధిక హీరోయిన్ గా నటించబోతోంది.
ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. మరి ఈ వయసులో.. మాజీ ముఖ్యమంత్రి భార్య.. హీరోయిన్ గా తిరిగి అవతారం ఎత్తడం అంటే ఒకింత చిత్రమే. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ తనయుడిగా కుమారస్వామి సినీ నిర్మాతగా అవతారం ఎత్తిన రోజుల్లో రాధికతో ఆయనకు పరిచయం ఏర్పడింది.
అప్పటికే వివాహితుడు, పిల్లలను కలిగిన వాడే అయినా.. కుమారస్వామి రాధికను వివాహం చేసుకున్నాడు. అయితే మరోవైపు కుమారస్వామి మొదటి భార్యతో కూడా అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. కుమారస్వామి రాజకీయానికి ఆమె వారసురాలైపోయే ప్రయత్నంలో ఉంది.
కుమారస్వామికి మొదటి భార్యతో కలిగిన కుమారుడు ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కుమారస్వామి రెండో భార్య హీరోయిన్ గా వస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కుమారస్వామి మొదటి భార్య అనిత కుమారస్వామి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మొత్తానికి జేడీఎస్ ఫస్ట్ ఫ్యామిలీ రాజకీయాల్లో, సినిమాల్లో బాగానే హడావుడి చేసేస్తోంది.