తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలిత మరణంపై నేటికీ ఎన్నో అనుమానాలు అటు కొందరు పార్టీ నేతలు, ఇటు మరికొందరు అభిమానుల్లోనూ ఉన్నాయి. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మరణించే వరకు చోటు చేసుకున్న పరిణామాలు, సొంత పార్టీలోని పలువురు కీలక నేతల అభిప్రాయాలు, విచారణకు చేసిన డిమాండ్లే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆరుముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను సెప్టెంబరు 25న ఏర్పాటు చేసింది. కోర్టులో కేసులు, ఇతర అంశాల నేపథ్యంలో ఈ నెల 27న ఏకసభ్య కమిషన్ బాధ్యతలు చేపట్టింది. ఆ సందర్భంగా 30న పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయాన్ని సందర్శించడంతో పూర్తి స్థాయి విచారణ ప్రారంభమవుతుందని, అన్ని కోణాల్లో పారదర్శకంగా దర్యాప్తు చేస్తానని జస్టిస్ ఆరుముగస్వామి పేర్కొన్నారు.
విచారణ పూర్తిచేసి గడువులోపు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నెల గడిచింది. విచారణ ప్రారంభం నుంచి మూడు నెలలా… కమిషన్ ఏర్పాటు నుంచి ఈ గడువు మొదలవుతుందా? అనేది పక్కన పెడితే డిసెంబరు 25లోపు ఈ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడానికి చర్యలు చేపట్టినట్లు తెలిసింది.జయలలిత మరణంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది సెప్టెంబరు 25న రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఆరుముగస్వామి నేతృత్వంలో కమిటీని వేసింది.
దర్యాప్తును ఈనెల 25 నుంచి ప్రారంభించనుండగా… ఈ కమిటీని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో దర్యాప్తు ఆలస్యమైంది. ఈ క్రమంలో ఈ నెల 27న చేపాక్కంలోని దర్యాప్తు కమిషన్ కార్యాలయంలో జస్టిస్ ఆరుముగస్వామి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విచారణను పారదర్శకంగా చేస్తానని, గడువులోపు నివేదికను ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పారు. గతేడాది సెప్టెంబరు 22న రాత్రి ఏం జరిగిందనే అంశం నుంచి జయలలిత ఎలా మరణించారనే వివరాల వరకు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ 30న పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయం సందర్శన తర్వాత ప్రారంభం అవుతుందని చెప్పారు. జయలలిత ఆసుపత్రి చేరి కన్నుమూసే వరకు చోటుచేసుకున్న పరిణామాల క్రమంలో ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర ఉన్నవారందరికీ కమిషన్ నోటీసులు పంపనుంది. వారి నుంచి నవంబరు 22వ తేదీలోపు కోరిన వివరాలను అందజేయాలని ఆదేశించనుంది. ఆ వివరాలతోపాటు స్వయంగా కొన్ని అంశాలు, కొందరు వ్యక్తులను కూడా ఈ కమిషన్ విచారించనుంది. మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి డిసెంబరు 25వ తేదీలోపు విచారణను ఓ కొలిక్కి తీసుకురావాలని కమిషన్ భావిస్తోంది. అవసరమైతే మరింత గడువు కోరాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.