ఫాతిమా మెడికల్ కాలేజీ యాజమాన్యం మోసం చేసిందని ఫాతిమా మెడికల్ కాలేజీ బాధిత విద్యార్థులు వాపోయారు. కాలేజీ యాజమాన్యంతో మంత్రి కామినేని శ్రీనివాస్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్ వేశారని విద్యార్థులు మండిపడ్డారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని విద్యార్థులు హెచ్చరించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దీంతో తమకు మరణమే శరణమా అని కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు వాపోయారు. సుప్రీంకోర్టులో చుక్కెదురు కావడంతో తమ భవిష్యత్తు ప్రభుత్వం చేతిలోనే ఉందంటూ ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆదివారం ఆయన నివాసానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెళ్లారు. సీఎం ఇప్పుడు కలవరని, సోమవారం సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రజాదర్బారులో కలుస్తారని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం సోమవారం కచ్చితంగా అమలయ్యే హామీ ఇవ్వకపోతే ఆయన ఎదుటే ఆత్మహత్యకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఫాతిమాలో సీట్లు రద్దయిన 99 మందికి 11 కాలేజీలలో 9 సీట్లు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన వైద్య ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ ఆ విషయాన్ని అఫిడవిట్లో పెట్టకపోవడం, మళ్లీ ఫాతిమా కాలేజీలోనే సీట్లు ఇస్తామని ప్రస్తావించడంతో కోర్టు దానిని అంగీకరించలేదని తెలిపారు..
