తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ అనవసర విమర్శలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. అటవీశాఖలో 50 శాతానికి పైగా ఖాళీలున్నాయని, ప్రసుత్తం 2800 ఖాళీలను భర్తీ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. గోదావరి పరీవాహనక ప్రాంతం , ఆదిలాబాద్ తప్ప ఎక్కడా అడవులు లేని దుస్థితి నెలకుందని అన్నారు. అందుకే సీఎం అయిన తర్వాత మొదటి వారంలో పెట్టుకున్న సబ్జెక్టే హరితహారమని చెప్పారు. మెదక్ నుంచి సిద్ధిపేట వచ్చే దారిలో భయంకరమైన అడవి ఉండేదని..అప్పటి అడవి మాయం కావడానికి కారణం ఎవరు అంటూ ప్రశ్నించారు.గుత్తికోయలు మన రాష్ర్టానికి చెందినవారు కాదన్న కేసీఆర్ .. రకరకాల కారణాలతో విచక్షణరహితంగా అడవులను నరుకుతుంటే చూస్తూ ఊరుకుందామా అంటూ ప్రశ్నించారు.
ప్రకృతి విపత్తులు వస్తే ఎవరు ఏం చేయలేమని, ముంబైలో భారీ వర్షాలకు 3 మీటర్ల మేర నీరు నిలిచిందని గుర్తు చేశారు. ముందు చూపులేకనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు. 5100 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేశామన్న కేసీఆర్ .. అవెన్యూ ప్లాంటేషన్ లో 90 నుంచి 95 శాతం మొక్కలు బతికాయని వెల్లడించారు.అన్యాక్రాంతమైన అటవీ భూములన్నీ వెనక్కి రావాలని, కోల్పోయిన అటవీ సంపద పునరుజ్జీవం పొందాలని అన్నారు. గత 10 ఏళ్లలో అడవుల సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ రూ. 130 కోట్లే ఖర్చు చేసిందని, 34 ఏళ్లలో 3 కోట్ల మొక్కలే నాటారని అన్నారు. వారంలోగా నరేగా, క్యాంపా ఫండ్స్ వివరాలు సభ ముందు పెడతామన్న కేసీఆర్ .. మనం ఎంత సంపాదించిన భవిష్యత్తు తరాలు అనుభవించే పర్యావరణ పరిస్థితులు కల్పించాలని అన్నారు.