రోబో 2.0 ఆడియో రిలీజ్ ఫంక్షన్ కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన సంగతి తెలిసిందే. ఒక సౌత్ ఇండియన్ చిత్రం ఇంత గ్రాండ్‌గా విదేశాల్లో ఒక ప్రోగ్రామ్ చేసుకోవడం అనేది ఇదే మొదటి సారి. స్కై డ్రైవ్ చేస్తూ మరీ పోస్టర్ రిలీజ్ చేయడం చూసి మతులు పోగొట్టుకోని వాళ్లు లేరు. ఇంతా చేసి ఆల్బమ్‌లో ఉన్న మూడు పాటలు విడుదల చేసింది రెండు సినిమాలో ఉండేది మాత్రం ఒక్కటే. ఇది తలైవా ఫ్యాన్స్‌కు పెద్ద షాక్. రజనీకాంత్ ఏ సినిమా తీసుకున్నా కనీసం ఐదు పాటలు ఉంటాయి. అంతెందుకు చిన్న గెస్ట్ రోల్ చేసిన కథానాయకుడు సినిమాలో రజనీ రెండు పాటల్లో కనిపిస్తారు. అలాంటిది ఇంత భారీ బడ్జెట్ సినిమా అందులోనూ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఇస్తున్న సినిమాలో పాటలు లేకపోవడం ఏంటని ఫ్యాన్స్ చెవులు చొరుక్కుంటున్నారు.
రోబో ఫస్ట్‌పార్ట్‌లో అద్భుతమైన ట్యూన్స్‌తో కూడిన ఆరు పాటలు.. ఒక బిట్ సాంగ్ రెహ్మాన్ కంపోజ్ చేశాడు. అవి సినిమాకు ప్లస్ అవడమే కాకుండా… శంకర్ కూడా వాటిని రిచ్‌గా తెరకెక్కించి సూపర్బ్ అనిపించాడు. అంతకు ఐదంతల బడ్జెట్‌తో రూపొందుతున్న రోబో – 2.0లో ఒక్కపాటే ఎందుకు అన్న సమాధానం శంకర్ అండ్ రజనీకాంత్‌కు మాత్రమే తెలుసు. అందిన సమాచారం మేరకు ఈ సినిమాలో చిట్టిరోబో పాత్రే ఎక్కువ సేపు ఉంటుందట. అదే పనిగా దానిమీద పాటలు పెడితే బాగుండదు గనుక వద్దనుకున్నారట. దానికితోడు రజనీకి ఉన్న అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా శారీరక శ్రమ ఇవ్వకూడదు అనే నిర్ణయం తీసుకున్నారట.
ఇకపోతే హీరోయిన్ అమీజాక్సన్ కూడా రోబో పాత్రనే చేస్తోంది. చిట్టి రోబోకు గేలం వేయడానికి అక్షయ్ కుమార్ అమీ రోబోను తయారు చేయిస్తాడు. కానీ అనూహ్యంగా అమీ రోబో చిట్టి వైపు తిరిగి సహాయం చేయడంతో కథ మలుపు తిరుగుతుందని టాక్. ఒక్క పాటే ఉన్న సినిమా మూడు గంటల వరకు వచ్చిందని తెలిసింది. ట్రిమ్ ఏమైనా చేస్తారా? లేదా? అనే విషయం సెన్సార్‌కు వెళితే తెలుస్తుంది. ఒక్కపాటతో ఏం సాధిస్తారు అని అంటున్నారు ఇండస్ర్టీ విశ్లేషకులు.