హైదరాబాద్‌కు మరో మణిహారం అలంకారం కానున్నది. హైదరాబాద్ నగర ప్రతిష్ఠను మరింత పెంచేలా, నగరానికి మరో ఐకానిక్ భవంతిగా నిలిచేలా ఇమేజ్ టవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాయదుర్గంలోని పదెకరాల స్థలంలో 16 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీనిని నిర్మించాలని నిర్ణయించారు. రహేజా మైండ్ స్పేస్ క్రాస్‌రోడ్స్ నుంచి ఇనార్బిట్ మాల్‌కు వెళ్లే దారిలో పక్కన స్థలాన్ని ఎంపికచేశారు. ఈ భవంతికి నవంబర్ ఐదున ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ వెంకటనర్సింహారెడ్డి చురుకుగా ఏర్పాట్లుచేస్తున్నారు. హైదరాబాద్‌ను యానిమేషన్, గేమింగ్ హబ్‌గా మార్చడంలో భాగంగా ఈ భారీ భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. జీఎఫ్‌ఎక్స్, ఐటీ అనుబంధ రంగాల సంస్థలకు స్థలాలు కేటాయించేలా ఇమేజ్ టవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేశారు. ఇప్పటికే టెండర్లు పిలిచారు. దేశంలోనే ప్రముఖ భవనాల్లో ఒకటిగా నిలిచేలా డిజైన్లు, ప్రణాళికలు రూపొందాయి. ఎటుచూసినా ఆంగ్ల అక్షరం టీ ఆకారంలో కనిపించేలా భవన నమూనా తయారుచేశారు. దీని నిర్మాణంలో టీఎస్‌ఐఐసీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ప్రాజెక్టు అడ్వయిజర్‌గా జోన్స్ లంగ్ లాసెల్లీ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వ్యవహరిస్తున్నది.
మూడేండ్లలో నిర్మాణం పూర్తి
హైదరాబాద్ నగరంలో అతి ఎత్తయిన భవనాల్లో ఒకటిగా వంద మీటర్ల ఎత్తున ఇమేజ్ టవర్‌నునిర్మించనున్నారు. నగరంలో అతి కొద్ది భవనాలు మాత్రమే ఈ ఎత్తుతో ఉన్నాయి. అయితే.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించే అతి ఎత్తయిన భవనంగా ఇది రూపుదిద్దుకోనుంది. మూడేండ్లలో దీని నిర్మాణం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రూ.946కోట్ల వ్యయం అవుతుందని ప్రతిపాదించారు. ఐటీ రంగం, ఫార్మా రంగాలకు హైదరాబాద్ ఇప్పటికే కీలక కేంద్రంగా మారింది. ఇతర రంగాల్లోనూ రాష్ట్రానికి పెట్టుబడులు, సంస్థలను ఆకర్షించడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భవిష్యత్ మార్కెట్ డిమాండ్ మేరకు రాబోయే కంపెనీలకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయడంద్వారా రాష్ట్రాన్ని పెట్టుబడులకు తగిన కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ అలోచనకు ప్రతిరూపంగా ఈ భవనం నిలువనుంది.
ఇవీ ఈ భవంతిలో ఉండేవి..
రాబోయే రోజుల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్ సెక్టార్ (ఏవీజీసీ) విభాగానికి డిమాండ్ పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ, జాతీయస్థాయి సంస్థలను నగరానికి ఆకర్షించేలా ఇమేజ్ టవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ భవనంలో ఏవీజీసీరంగానికే కాకుండా ఐటీ, ఐటీఈఎస్, జీఎఫ్‌ఎక్స్ రంగాలకు చెందిన సంస్థలకు కార్యాలయ స్థలాలు కేటాయించేలా నిర్మాణాలు చేపడుతారు. 1.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టూడియోలు, క్యాప్చర్ స్టూడియోలు, గ్రీన్ మ్యాట్ స్టూడియోలు, డీఐ సూట్, ఎడిటింగ్ ల్యాబ్స్, డాటా మేనేజ్‌మెంట్ ల్యాబ్స్, డబ్బింగ్ సూట్, డాటా సెంటర్, ఆడిటోరియం, స్క్రీన్ థియేటర్లు నిర్మిస్తారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఏవీజీసీ ఆఫీసులకోసం 6.25లక్షల చదరపు అడుగులు కేటాయించారు. 18వేల చదరపు అడుగుల్లో బిజినెస్ సెంటర్‌ను నిర్మిస్తారు. ఐటీ, ఐటీఈఎస్ కార్యాలయాలకోసం ఏడు లక్షల చదరపు అడుగుల్లో కార్యాలయాలను ఏర్పాటుచేస్తారు. రెస్టారెంట్, ఇతర అవసరాలు, సౌకర్యాలకోసం 80వేల చదరపు అడుగులను కేటాయించారు. ఆయా రంగాల్లో అంతర్జాతీయ, జాతీయ సంస్థలు వచ్చినవెంటనే కార్యకలాపాలు ప్రారంభించుకునేలా ఏర్పాట్లుంటాయి.